తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎవరో ప్రత్యర్ధులు దెబ్బకొట్టాలసిన అవసరం లేదు..ఎందుకంటే ఆ ఛాన్స్ కాంగ్రెస్ నేతలు ఎవరు ఇవ్వరు..కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ నేతలే దెబ్బకొడతారు. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో అదే జరుగుతూ వస్తుంది. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే టిపిసిసి అధ్యక్షుడు అయ్యారో అప్పటినుంచి కాంగ్రెస్ లో రచ్చ నడుస్తోంది. ఎప్పటినుంచో కాంగ్రెస్ లో ఉంటున్న వారిని కాదని, టీడీపీ నుంచి రేవంత్ రెడ్డికి పిసిసి ఇవ్వడంపై సీనియర్లు రగిలిపోతున్న విషయం తెలిసిందే.
ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు ఏ స్థాయిలో రేవంత్‌ని టార్గెట్ చేశారో తెలిసిందే. మిగిలిన సీనియర్లు పరోక్షంగా రేవంత్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అటు రేవంత్ సైతం సీనియర్లకు చెక్ పెట్టాలని చూస్తున్నారని తెలిసింది. ఇలా సీనియర్లు వర్సెస్ రేవంత్ అన్నట్లు పోరు నడుస్తోంది. ఇదే క్రమంలో పార్టీలో ఇప్పుడు పదవుల పంపకాలు చిచ్చు పెట్టాయి. రేవంత్ తన వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుని, కాంగ్రెస్ సినీయర్లని పక్కన పెట్టాలని చూస్తున్నారని విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలో కొందరు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇక భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు సగం పదవులు టీడీపీ నుంచి వచ్చిన వారికే ఇచ్చారని, కాంగ్రెస్‌ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారని, ఎట్టి పరిస్తితుల్లోనూ ఆ పరిస్తితి రానివ్వమని అంటున్నారు. సీనియర్లు అంతా సమావేశమై..సేవ్ కాంగ్రెస్ పేరిట ముందుకెళుతున్నారు.
ఇదే సమయంలో తాజాగా సీతక్క సహ 12 మంది నేతలు పిసిసి పదవులకు రాజీనామాలు చేశారు. వీరంతా టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరినవారే. అలాగే హాత్‌సే హాత్ జోడో యాత్రని జనవరి 26 నుంచి తెలంగాణలో ఏ విధంగా నిర్వహించాలని రేవంత్ ఆధ్వర్యంలో తాజాగా గాంధీ భవన్‌లో సమావేశం జరిగితే..ఆ సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టారు. వీరు ఈ నెల 20వ తేదీన సెపరేట్ గా మహేశ్వర్ రెడ్డి ఇంట్లో భేటీ అవ్వనున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని సరిగ్గా పనిచేయనివ్వరు అని, కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ నేతలు, టీడీపీ నుంచి వచ్చిన వారు, ముందు నుంచి కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టారని బీజేపీ నాయకురాలు విజయశాంతి కామెంట్ చేశారు. పరిస్తితి చూస్తే అలాగే ఉంది. కేసీఆర్ అనుకూలంగా ఉండే కొందరు..పార్టీలో చిచ్చు లేపినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ లో ఉన్న కలహాలని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది. కొందరు నాయకులని బీజేపీలోకి లాగాలని చూస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బాగుపడేలా లేదు.