నేటి రాజకీయాల్లో వ్యూహకర్తల హవా ఎక్కువైపోయింది..ఒకప్పుడు కేవలం పార్టీ అధినేతలే వ్యూహాలు రచించే వారు ప్రత్యర్ధులకు చెక్ పెట్టడం కోసం పనిచేసేవారు. కానీ ఇప్పుడు పరిస్తితి మారిపోయింది. రాజకీయ నేతల వ్యూహాలు వర్కౌట్ కావడం లేదు..దీంతో ప్రత్యేకంగా వ్యూహకర్తలని నియమించుకుంటున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ ట్రెండ్‌ని జగన్ మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీం పనిచేసింది.
ఇక వారి వ్యూహాలు ఏ స్థాయిలో నడిచాయో చెప్పాల్సిన పని లేదు..ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి టీడీపీని దెబ్బకొట్టి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేశారు. అలా వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తర్వాత వ్యూహకర్త నుంచి తప్పుకున్నారు. తన సొంత రాష్ట్రం బీహార్‌కు వెళ్ళి అక్కడ రాజకీయాలు చేసుకుంటున్నారు. కానీ ఐప్యాక్ టీం మాత్రం ఏపీలో వైసీపీ కోసం పనిచేస్తూనే ఉంది. అయితే గతంలో ఐప్యాక్ టీంలో పనిచేసిన కొందరు సభ్యులు ఇతర పార్టీలకి వ్యూహకర్తలుగా వెళ్ళిపోయారు.
సునీల్ కానుగోలు..తెలంగాణలో కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారు. రాబిన్ శర్మ ఏపీలో తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఐప్యాక్ టీం లో పనిచేసే శంతన్ సింగ్ టీడీపీ వైపు వచ్చారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న రాబిన్ శర్మ షోటైమ్ కన్సల్టింగ్ బృందంలో చేరారు.
ఐప్యాక్ టీమ్ లో కోర్ మెంబర్‌గా పనిచేసిన శంతన్‌ను టీడీపీ పోల్ వర్కౌట్ కోసం నియమించుకుంది. కానీ ఇలా ఐప్యాక్ లో చేసే శంతన్ టీడీపీ వైపుకు రావడం వైసీపీకి పెద్ద మైనస్ అవ్వచ్చు. ఎందుకంటే ఎక్కువ కాలం ఆయన వైసీపీకి చేసివుండటంతో ఆ పార్టీ అనుసరిస్తోన్న వ్యూహాలు, బలహీనతలు తెలిసే ఛాన్స్ ఉంది. దాని బట్టి వ్యూహాలు వేసి..వైసీపీని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఏపీలో వ్యూహకర్తల మధ్య వార్ నడుస్తోంది.