తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో కీలక సమావేశం ప్రారంభం అయింది. అయితే ఈ కీలక సమావేశంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ మంత్రుల తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆర్థిక, శాసన సభ వ్యవహారాల మంత్రులు, ఫైనాన్స్ అధికారులు హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలోనే కీలక ప్రకటన వచ్చింది.
మార్చి 7వ తేదీన.. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కాసేపటి క్రితమే… ప్రగతి భవన్ అధికారులు ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… అధ్యక్షతన ప్రగతి భవన్ లో కీలక సమావేశం ఇంకా కొనసాగుతోంది.
అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి వరకు కొనసాగుతాయి అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే బడ్జెట్ ఏ రోజున ప్రవేశపెడతారు… ప్రతిపక్షాలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై… ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరో గంటపాటు ప్రగతి భవన్ లో మంత్రుల సమావేశం జరగనుంది. అనంతరం తెలంగాణ మంత్రులు బడ్జెట్ సమావేశాలపై మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.