ప్లీజ్ పవన్ ‘ గ్రేటర్ ‘ క్లారిటీ ఇవ్వు ! పాపం బిజెపికి ఎన్ని అనుమానాలో ?

-

లక్షలాది మంది అభిమానులు, ఓ బలమైన ప్రధాన సామాజికవర్గం అండదండలు పుష్కలంగా ఉన్నా, ఏపీలో మాత్రం పవన్ రాజకీయం గా సక్సెస్ కాలేకపోతున్నారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా జనసేన ఓటమి చెందింది. ఒకే ఒక్క సీటును జనసేన పార్టీ దక్కించుకుని మరెంతో అభాసుపాలైంది. ఇక ఆ ప్రభావానికి పవన్ జనసేన ను మూసేసి, సినిమాల వైపు వెళ్లిపోతారని అంతా అనుకున్నా,  పవన్ మాత్రం సీఎం కుర్చీ ఎప్పటికైనా తనదే అంటూ గొప్పగా చెబుతూ వస్తున్నారు. కానీ రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో కానీ, ప్రజాక్షేత్రంలో బలపడడం వంటి విషయాల్లో కానీ, పవన్ కు స్పష్టమైన క్లారిటీ లేకపోవడం, దాదాపు ఇదే రకమైన ఇబ్బందిని ఏపీలో బీజేపీ ఎదుర్కొంటూ ఉండడం వంటి కారణాలతో , రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని ఏపీలో బలపడి , ఎన్నికలకు వెళితే అధికారం దక్కించుకోవడం కష్టమేమీ కాదు అనే అభిప్రాయానికి వచ్చాయి.
కానీ పవన్ అడుగులు మాత్రం బీజేపీకి అనుమానాస్పదంగానే కనిపిస్తూనే వచ్చాయి. ఒకవైపు బీజేపీతో పొత్తు ఉన్నా, ఆయన టిడిపి అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటున్నాడు అనే అనుమానాలు కలుగుతున్నాయి. పవన్ వైఖరి ఎలా ఉన్నా, రానున్న రోజుల్లో అయినా , ఆయన వైఖరిలో మార్పు వస్తుందని , బిజెపి సైలెంట్ గానే ఉంటూ వచ్చింది. ఇక తెలంగాణలో బిజెపి ఈ మధ్యకాలంలో బాగా బలం పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ బలహీన అవ్వడంతో, ఆ స్థానాన్ని బిజెపి ఆక్రమించుకుంది. ఇప్పుడు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా, టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్లుగానే పరిస్థితి ఉండడంతో, టీఆర్ఎస్ పై చేయి సాధించేందుకు పవన్ సహకారం తీసుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది.
పవన్ కు లక్షలాది మంది అభిమానులు ఉండటం, బీజేపీకి కలిసి వస్తుందని ఆ పార్టీ భావించింది.  అలాగే దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి పవన్  తీసుకు వచ్చి ప్రచారం చేయించాలని బిజెపి భావించింది.  స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారానికి రావలసిందిగా కోరినా, పవన్ మాత్రం పెద్దగా స్పందించలేదు. ఆ ఎన్నికల తంతు పూర్తవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా, పవన్ బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొంటారా లేదా అనే అనుమానం బిజెపి నాయకుల్లో కలుగుతోంది. అవసరమైతే జనసేన కు కొన్ని సీట్లను కేటాయించేందుకు బిజెపి మొగ్గు చూపుతోంది.
ఇదిలా ఉంటే , టిఆర్ఎస్ పార్టీకి , కెసిఆర్ కు వ్యతిరేకంగా పవన్ గళం వినిపిస్తారా లేదా అనేది ఇప్పుడు బిజెపికి అనుమానంగా ఉంది. ఎందుకంటే బీజేపీకి టిఆర్ఎస్ బద్ధశత్రువు అని తెలిసినా, పవన్ ఏమాత్రం పట్టించుకోకుండా, ఇటీవల హైదరాబాద్ ముంచెత్తిన వరదలు కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు పవన్ కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అందులో పవన్ ను తప్పు పట్టేందుకు ఏమీ లేకపోయినా,  ఆ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పవన్ పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే అంతకు ముందు అనేక సందర్భాల్లో కేసిఆర్ పరిపాలన తీరును,  ఆయనను పవన్ పదే పదే పొగుడుతూ వస్తుండటం బీజేపీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఏదో రకంగా గ్రేటర్ పరిధిలో జనసేనకు కొన్ని సీట్లను కేటాయించి, ఎన్నికల ప్రచారానికి దింపాలని చూస్తున్నా, కేసీఆర్ ను విమర్శించేందుకు పవన్ ఇష్టపడతారా లేదా అసలు ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది అనేది బీజేపీ నేతలకు అంతుపట్టడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news