రాజకీయ నేతలు మాట్లాడుతున్న భాషపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మహబూబాబాద్ పరిధిలో పాదయాత్రకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో ఇచ్చిన అనుమతులను ఎస్పీ రద్దుచేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రూపేందర్ వాదనలు వినిపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తుండటంతో అనుమతులు రద్దు చేసినట్లు చెప్పారు. సంబంధిత వీడియోను పరిశీలించాలని కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ…‘ఏం చూడాలి? రోజూ పత్రికలు, టీవీలలో చూస్తూనే ఉన్నాం కదా’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ న్యాయవాది అందించిన వీడియోను ఒక్క క్షణం చూసి, ఇక చూడలేమంటూ తిరస్కరించారు.
గతంలో హైకోర్టు షరతులతో అనుమతులిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. వాటిని ఎలా ఉల్లంఘిస్తారని షర్మిల న్యాయవాదిని ప్రశ్నించారు. ఉల్లంఘించలేదని, స్థానిక ఎమ్మెల్యే ఆరోపణలకు సమాధానం ఇచ్చామంటూ ఆయన ఇచ్చిన సమాధానాన్ని న్యాయమూర్తి తిరస్కరించారు. ‘హైకోర్టు షరతులు విధించినపుడు కట్టుబడి ఉండాల్సిందే. అలా ఉంటామని ప్రమాణపత్రం దాఖలుచేస్తే అనుమతుల విషయాన్ని పరిశీలిస్తాం’ అని తెలిపారు. అఫిడవిట్ దాఖలు చేయడానికి గడువు ఇస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.