వివాదాస్పద కేసులే ప్రాణాల మీదికి తెచ్చాయా?

-

నడిరోడ్డు మీద కత్తులు స్వైర విహారం చేశాయ్‌. అంతా చూస్తుండగా రెండు ప్రాణాల్ని బలి తీసుకున్నాయ్‌. పెద్దపల్లి జిల్లాలో లాయర్‌ దంపతుల హత్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యకు అసలు కారణమేంటి? ప్రాణ హాని ఉందని చెప్పినా పోలీసులు లైట్ తీసుకున్నారా..వివాదాస్పద కేసులే ఈ దంపతుల ప్రాణాల మీదికి తెచ్చాయా..వామనరావు హత్యపై ఇప్పుడు ఇవే అనుమానాలు తెరమీదికి వస్తున్నాయి.

నిన్న మధ్యాహ్నం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం.. కల్వచర్ల సమీపంలో లాయర్‌ వామనరావు, ఆయన భార్య నాగమణిని దారుణంగా హత్య చేశారు దుండగులు. రాంగ్‌ రూట్లో కారులో వచ్చి వారి వాహనాన్ని అటకాయించి కత్తులతో దాడి చేశారు. ముందు వామనరావుపై దాడి చేయగా ఆయన భార్య నాగమణి అడ్డుకుంది. అయితే ఆమెపై కూడా దాడి చేసి ప్రాణాలు తీశారు. చనిపోయే ముందు కుంట శ్రీను పేరు వామనరావు చెప్పడంతో అతడితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆలయ కమిటీ విషయంలో వీరిద్దరి మధ్య వివాదం జరుగుతున్నట్టు తేలింది.

న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య పక్కా ప్లాన్‌ ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. మొదట వారి కారు అద్దాలు పగలగొట్టారు. దీంతో భయభ్రాంతులకు గురైన వామన్‌రావు కారు డ్రైవర్‌ సతీష్‌ డోరు తీసుకుని పారిపోగా.. లోపలున్న దంపతులపై దుండగులు కత్తులతో దాడిచేశారు. వామన్‌రావు భార్య నాగమణి కారులోనే కుప్పకూలిపోయింది.. వామన్‌రావును కారు నుంచి రోడ్డుపైకి లాక్కొచ్చి కత్తులతో విచక్షణారహితంగా నరికారు. ఆయనపై దాడి జరుగుతున్నంతసేపూ రోడ్డుకు ఇరువైపులా మంథని డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. జనమంతా అక్కడ చూస్తూ ఉండిపోయారు. కాని ఏ ఒక్కరు కూడా ఆపేప్రయత్నం చేయలేదు.

మరోవైపు పలు ఆంశాలపై రాజకీయ, పోలీసులు, ప్రభుత్వ అధికారుల తీరుపై పలు ఆంశాల్లో హైకోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేసిన తీరు ఆయా వర్గాలకు వివాదాస్పదుడి గా వామన్‌రావు మారాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు 900 కోట్లు ఇసుక క్వారీలతో అక్రమంగా సంపాదించాడని హైకోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేసి మధు పోటీ చేయకుండా ప్రయత్నించిన తీరు అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ప్రస్తుత శ్రీధర్‌బాబుకు అనుకూలంగా వ్యవహరించారనే రాజకీయ విమర్శలు పుట్ట మధు ఆయన వర్గీయులు ఆరోపణలు చేశారు. మరోపక్క వామన్ రావు హత్య కేసుని సుమోటోగా స్వీకరించింది హైకోర్టు.

వన్యప్రాణి వేట కేసులో మంథని పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్న నిందితుడి సంఘటనలో సైతం పోలీసులే కొట్టి చంపారని కోర్టులో వామన్ రావు పిటిషన్‌ ఫైల్‌ చేసిన తీరు కూడా వివాదాస్పదమైంది. హత్య జరిగింది నడిరోడ్డుపై..చనిపోయిన భార్యా భర్తలు ఇద్దరూ లాయర్లే వారు వాదించిన..వాదిస్తున్న కేసులు కూడా వివాదాస్పదమైనవని చెబుతున్నారు. అందుకే వారి హత్య ఇప్పుడు అలజడి సృష్టిస్తోంది. దీనివెనక నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఇటు విపక్షాలు కూడా డిమాండ్‌ చేస్తున్నాయి. వామనరావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు మేరకు కుంట శ్రీనివాస్‌తో పాటు వసంతరావు, కుమార్‌ అనే యువకులపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆ ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news