మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ కు పరిమితమై బూతు ట్రెండ్ ఇప్పుడు తెలంగాణకు కూడా పాకిందా? గత నాలుగైదు రోజులుగా ప్రధాన పార్టీల నేతల వ్యాఖ్యలను, మాటలను చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. సాలే, గూట్లే, గాండు, పీకుడు, బట్టేబాజ్, లుచ్చాగాడు.. ఇంకా పెద్ద పెద్ద తిట్లు…రాయడానికి వీల్లేని ఎన్నో తిట్లు నేతల నోళ్ల నుండి ధారాళంగా వినిపిస్తున్నాయి. ఎవరు ఏమనుకుంటారు? ఆ బూతులతో మనం మన సమాజానికి, పిల్లలకు ఎలాంటి సందేశం ఇస్తున్నామో సోయి లేకుండానే మాటలు తూలుతున్నారు.
అరేయ్, తురేయ్, నీ బతుకు ఎంత? నువ్వో బచ్చాగాడివి, లుచ్చాగాడివి, నా చెప్పుతో సమానం,నీ బాగోతం బయటపెడుతా వంటి వ్యాఖ్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఇక బాడీ షేమింగ్ కు అయితే లెక్కేలేదు. సన్నాసి.. లుచ్చా.. బద్మాష్.. లఫూట్.. కుక్కలు..తూ..మీ బతుకు చెడ.. ఏరా.. బోడిగుండ, అరగుండు,`పొట్టోడు, బక్కోడు, నల్లోడు, గద్ద ముక్కోడు, బ్రోకర్ వంటి పదాలను ఈజీగా అనేస్తున్నారు.ప్రజాసమస్యలను పక్కన పెట్టి..వాటిపై చర్చకు తావులేకుండా అన్నట్లుగా ఒంటికాలిపై లేస్తూ బండబూతులు మాట్లాడుతున్నారు. నోటికి ఏదోస్తే అదే వాగుతున్నారు. బజారు భాషను రాజభాషగా చేస్తున్నారు.
సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు అనే తేడా లేకుండా ఈ పదాలను సునాయాసంగా వాడేస్తున్నారు, మరి అక్కడ పెద్దవారు ఉన్నారా? మహిళలు ఉన్నారా? యువతీ యవకులు ఉన్నారా? పిల్లలు ఏమనుకుంటారు అనే సోయే లేకుండా పోయింది. ఎన్ని తిట్లు తిడితే అంత పెద్ద లీడర్ అనే స్థాయికి వచ్చింది.
తెలంగాణ సంస్కృతి అంటే నోటికొచ్చినట్లుగా తిట్టుడా…? వీళ్ల తిట్లను కళ్ళప్పగించి చూస్తూ ఉండాలా..? ప్రజలు వీళ్ల తిట్లు విని తరించాలని కోరుకుంటున్నరా..? ప్రజల సమస్యలను తీర్చేందుకు. అధికారంలోకి రావడానికి, ఉన్న అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తిట్లే ఆధారమా? అంతేగానీ.. చేసిన పనిని… చేయబోయే పనిని వివరించరా? అని తెలంగాణ బుద్ది జీవులు, మర్యాదస్తులు ప్రశ్నిస్తున్నారు. ఏమిటీ నోటి గాయి.. ధమ్కీలు, బండబూతులు అంటూ ఆవేదన చెందుతున్నారు.రాజకీయాలంటే బూతులు తిట్టుకోవడమేనా? వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని పేర్కొంటున్నారు.
రాజకీయంగా పైచేయి సాధించేందుకు ముఖ్యనేతలందరూ బూతును ఆశ్రయించడమే పెద్ద విషాదం. ఇందులో ఎవరికీ మినహాయింపులేదు. ఇదిలాగే కొనసాగితే రాజకీయాలపై ప్రజల్లో విరక్తి కలిగే ప్రమాదముంది. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర నష్టదాయకమన్న విషయాన్ని
గుర్తిస్తే మంచిది.