బెంగళూరు వరదలపై మంత్రి కేటీఆర్ ట్వీట్

-

కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రహదారులన్నీ జలమయంగా మారి చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, కార్యాలయాల్లోకి కూడా వరద నీరు చేరింది. వరదల వల్ల ఐటీ కారిడార్‌లోని తమ కంపెనీలకు రూ.225కోట్ల నష్టం వాటిల్లినట్లు బెంగళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌ కంపెనీస్‌ అసోసియేషన్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి లేఖ కూడా రాసింది. దీనిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్‌ వేదికగా స్పందించారు.

పెరుగుతున్న పట్టణీకరణతో మౌలిక వసతులను అప్‌గ్రేడ్‌ చేసేందుకు తగినంత మూలధనం లేకపోతే ఇలాగే జరుగుతుందని బెంగళూరు నగరాన్ని ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘‘మన నగరాలే దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తాయి. అటువంటి నగరాల్లో మౌలిక వసతులు బాగుండాలి. నాణ్యమైన రోడ్లు, నీరు, గాలి, నీటి నిర్వహణ సదుపాయాలు కల్పించడం పెద్ద కష్టమైన పని కాదు. అందుకు అవసరమైన మూలధనాన్ని కేంద్ర హౌసింగ్‌, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ చూసుకోవాలి. పట్టణ ప్రణాళిక పాలనలో మనకు సంస్కరణలు చాలా అవసరం. నేను చెప్పిన మాటలు చాలా మంది హైదరాబాదీలకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఇదే పరిస్థితి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కొందరు బెంగళూరు నేతలు మనల్ని విమర్శించారు. కానీ ఒక దేశంగా ఎదగాలంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి’’ అని ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news