తెలంగాణలో మండుతున్న ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. తెలంగాణ వ్యాప్తంగా మబ్బులు పట్టాయి. దీంతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. చాలా రోజుల నుంచి ఎండల ధాటికి అల్లాడుతున్న జనానికి ఉపశమనం లభించినట్లు అయింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
ఇదిలా ఉంటే తెలంగాణకు చల్లని కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు సముద్ర ఉపరితలానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. దీంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాాయి. దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.