తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొత్త సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర సచివాలయ నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగతా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు మూడు వేల మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పనులు చేస్తున్నారు. ప్రస్తుతం సచివాలయం పైభాగాన డోమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. డోమ్‌ల కాంక్రీట్ పనులు పది రోజుల్లో పూర్తి కానున్నాయి. అలాగే సచివాలయ భవనం లోపల అన్ని రకాల పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. సచివాలయం వెనక భాగంలో గుడి కోసం 1500 గజాల్లో, చర్చి కోసం 500 గజాల్లో, మసీదు కోసం 1500 గజాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. అవి కూడా 90 శాతానికి పైగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ నెలన్నర నుంచి రెండు నెలల వ్యవధిలో పూర్తవుతాయని రోడ్లు, భవనాల శాఖ(ఆర్ అండ్ బీ) వర్గాలు తెలిపాయి.
అంటే వచ్చే సంక్రాంతి కల్లా కొత్త సచివాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. రోడ్లు భవనాల శాఖ సచివాలయ పనులన్నింటిని పూర్తి చేసి జనవరిలో సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు అప్పగించనుంది. అయితే కొత్త సెక్రటేరియట్ నుంచి పరిపాలన ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై సీఎం కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్లమెంట్ ఆవరణలో ఉన్నట్లుగానే తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో కూడా రెండు భారీ ఫౌంటెయిన్లను నిర్మిస్తున్నారు. సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేస్తున్న ఈ ఫౌంటెయిన్లు సచివాలయానికి మరింత వన్నె తెస్తాయని ఆర్ అండ్ బీ వర్గాలు తెలిపాయి. మంత్రులు, అయా శాఖల ముఖ్య కార్యదర్శుల చాంబర్లు, సెక్షన్ కార్యాలయాలు కూడా శరవేగంగా సిద్ధమవుతున్నాయి. వైరింగ్, ఫర్నిచర్ ఏర్పాటు దాదాపు పూర్తి కావొచ్చిందని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు వెల్లడించారు.