బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ త్వరలో కనుమరుగు కాబోతోందని.. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. అయితే తాము పార్టీ మారడంపై పెట్టిన కేసును చూపెట్టి వారిని బీఆర్ఎస్ అధిష్ఠానం భయపెడుతోందని ఆరోపించారు. అందుకే వాళ్లు పార్టీ మారకుండా ఆగుతున్నారని, కానీ ఆలస్యమైనా కాంగ్రెస్ లో ఆ ఎమ్మెల్యేల చేరిక కచ్చితంగా ఉంటుందని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.
తమ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి ని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవప్రదంగా ఉండే హరీశ్ రావు కూడా గాడి తప్పారని, బీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టి నోటికొచ్చినట్లు మాట్లాడే విధంగా ప్రేరేపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళానని వెల్లడించారు ఎమ్మెల్యే దానం నాగేందర్.