మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 8 వ తేదీన స్పీకర్ అందుబాటులో ఉండడంతో ఆ రోజునే స్పీకర్ ను కలిసి తన రాజీనామా లేక సమర్పించనున్నారు. దీంతో మునుగోడుకు నవంబర్ లేదా డిసెంబరులో ఉప ఎన్నిక రావచ్చు అని అంచనా వేస్తున్నారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు హిట్ ఎక్కాయి. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావడంతో మునుగోడు ఉప ఎన్నికలను సవాలుగా తీసుకుంటుంది కాంగ్రెస్. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసిన మూడు రోజుల్లోనే మునుగోడుకు వెళ్లి బహిరంగ సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. మునుగోడు లో మండలాల వారీగా ఇన్చార్జిలను నియమించింది.

చౌటుప్పల్ మండలానికి కురివి విజయ్, సంస్థాన్ నారాయణపురం మండలానికి కేతురి వెంకటేష్, గట్టుప్పల్ మండలానికి చరన్ యాదవ్, చండూరు మండలానికి బెల్లయ్య నాయక్, నాంపల్లి మండలానికి అద్దంకి దయాకర్ , మర్రిగూడ మండలానికి దుర్గం భాస్కర్ ని నియమించింది. మునుగోడు ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ఉన్నారని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.