ఈనెల 10వ తేదీన తెలంగాణకు అమిత్ షా

-

రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలను బీజేపీ మరింత వేగవంతం చేసింది. ఓవైపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తూ.. మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ వైఫల్యాలు ఎండగడుతూ.. మరోవైపు కాంగ్రెస్పై విమర్శల వర్షం కురిపిస్తూ.. ఈ రెండు పార్టీలు తెరవెనక జతకట్టాయని ఆరోపణలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించి బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మహబూబ్నగర్ సభలో హామీల వర్షం కురిపించి.. నిజామాబాద్ సభలో సంచలన వ్యాఖ్యలు చేసి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. ఇప్పటికే ప్రధాని మోదీ రెండు బహిరంగ సభల్లో పాల్గొనగా…… ఈనెల 10న రాష్ట్రంలో అమిత్ షా పర్యటించనున్నారు.

ఖానాపూర్ లేదా ఆదిలాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఆ సభకు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరవుతారని పార్టీ నేతలు వెల్లడించారు. మరోవైపు రేపు జరగనున్న బీజేపీ రాష్ట్ర పదాదికారుల సమావేశానికి ఆ పార్టీ సంస్థాగత జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరుకానున్నారు. ఎన్నికల ముందు జరుగుతున్న పథాదికారుల సమావేశంలో పలు తీర్మానాలు రూపొందించనున్నారు. ఆ తర్వాత ఘట్‌కేసర్‌లో ఎల్లుండి జరిగే కౌన్సిల్ భేటీలో తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు. ఆ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా హాజరుకానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version