తెలంగాణలోని మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అటానమస్ హోదాను కల్పిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. న్యాక్ ఏ గ్రేడ్ ను దక్కించుకోవడంతో మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు యూజీసీ అటానమస్ హోదాను దక్కించుకున్నాయి. అటానమస్ హోదాను దక్కించుకున్న కళాశాలల్లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి.
గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలోని 11 డిగ్రీ కాలేజీలు అటానమస్ హోదాను కైవసం చేసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని మరో మూడు కళాశాలలకు అటానమస్ హోదా రావడంతో రాష్ట్రంలోని మొత్తం అటానమస్ కళాశాలల సంఖ్య 14కి చేరింది. అటానమస్ హోదా విషయంలో యూజీసీ ఇటీవల పలు మార్పులు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సందడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో వర్సిటీలతో సంబంధం లేకుండా నేరుగా యూజీసీకి దరఖాస్తు చేసేవిధంగా పోర్టల్ ను మోడీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.