తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ బతుకమ్మ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి సిద్దం అవుతుంది. ప్రతి ఏడాది తెలంగాణ ఆడపడుచులకు పంపిణీ చేసే బతుకమ్మ చీరల కోసం ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. బతుకమ్మ చీరలన్నీ.. ఆకర్షనీయమైన డిజైన్లలో ఉండటానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. దీంతో ఈ ఏడాది బతుకమ్మ చీరలు 200 డిజైన్లలో రాబోతున్నాయి. అలాగే మొత్తం 10 రంగులలో బతుకమ్మ చీరలు తయారు కాబోతున్నాయి. బతుకమ్మ చీరల తయారి ప్రణాళికను మర మగ్గాల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.
అలాగే ఈ ఏడాది కోటి బతుకమ్మ చీరలు తయారు చేయాలని ఆర్డర్స్ కూడా ఇచ్చింది. దీంతో వస్త్ర పరిశ్రమకు పేరు గాంచిన సిరిసిల్లా బుధ వారం నుంచే ఆర్డర్లను తీసుకుంటుంది. కాగ ఈ ఏడాది బతుకమ్మ చీరల ఆర్డర్లను అత్యధికంగా సిరిసిల్లాకు 4.48 కోట్ల మీటర్లు ఆర్డర్లు చేశారు. అలాగే మండే పల్లి టెక్స్ టైల్ పార్క్ కు 25 లక్షల మీటర్లు, కరీంనగర్ లోని కర్షకుర్తికి 14 లక్షల మీటర్లు, హనుమకొండకు 6.31 లక్షల మీటర్లు, వరంగల్ కు 93 వేల మీటర్ల చీరల ఉత్పత్తకి ఆర్డర్స్ ఇచ్చారు.
కాగ మొత్తం ఈ ఏడాదికి దాదాపు 5 కోట్ల మీటర్ల వస్త్రం అవసరం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కాగ బతుకమ్మ చీరల తయారి వల్ల నేత కార్మికులకు ఆరు నెలల పాటు రోజుకు దాదాపు రూ. 900 చొప్పున వేతనం లభిస్తుంది.