తెలంగాణలో హైదరాబాద్ సహా మెజార్టీ స్థానాల్లో బీజేపీ గెలువబోతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎన్డీయే కూటమి 400కు పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఇండియా కూటమిలోని పార్టీల్లో ఐకమత్యం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ కేరళలో సీపీఐతో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ చేస్తోందని ఎద్దేవా చేశారు. 2047 నాటికి వికసిత్ భారతే తమ లక్ష్యమన్నారు. మోడీ హవాతో ఈ ఎన్నికల్లో తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం చేవెళ్ల లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్ లోని ఆర్వో కార్యాలయంలో ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్ పత్రాలు అందజేశారు.