ఏదో అనుకుంటే ఏదో అయినట్లు ఉంది..తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్ పార్టీ పరిస్తితి. వరుసగా రెండుసార్లు గెలిచి..మూడోసారి కూడా అధికారంలోకి రావాలని చూస్తున్న బిఆర్‌ఎస్..ప్రత్యర్ధులకు చెక్ పెడుతూ ముందుకెళ్లాలని చూస్తుంది. అలాగే ప్రజల్లో మరింత బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎన్నికల సమయం దగ్గర పడటంతో బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు.
ఇదే క్రమంలో ఆత్మీయ సమ్మేళనాలు పేరిట సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే…కేసిఆర్ సర్కార్ ప్రజలకు చేసిన మేలు..సంక్షేమం, అభివృద్ధి అందరికీ తెలిసేలా చెప్పడం..అలాగే విభేదాలు పక్కన పెట్టి అంతా కలిసి కట్టుగా పార్టీ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఆత్మీయ సమ్మేళనం అంటూ కార్యక్రమం పెట్టారు. కానీ ఈ సమావేశాల్లో అనుకున్నట్లు జరగట్లేదు..పూర్తిగా రివర్స్ జరుగుతుంది. ఒక్కో చోట ఒక్కో రచ్చ జరుగుతుంది.
మొదట ఈ సమావేశాలని భజన సమావేశాలుగా మార్చారు. నేతలు ఎంతసేపటికి కేసిఆర్ కు భజన చేస్తున్నారు తప్ప…కేసిఆర్ చేస్తున్న పనులు ఏంటో ప్రజలకు చెప్పే కార్యక్రమం చేయడం లేదు. దీని వల్ల పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. నేతలు ఏమో కేసిఆర్ దృష్టిలో పడాలని పోటీ పడి మరీ భజన చేస్తున్నారు. అలాగే బిజేపిని తిట్టడం చేస్తున్నారు.
ఇదొక ఎత్తు అయితే నేతలు ఓ రేంజ్ లో ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఫ్లెక్సీల్లో తమ బొమ్మలు లేవని కొందరు అలుగుతుంటే..తమని కార్యక్రమానికి పిలవలేదని మరికొందరు అలుగుతున్నారు. ఉదాహరణకు మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రెడ్యానాయక్ ఫోటోని ఫ్లెక్సీలో వేయలేదని, ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారు. అటు వికారాబాద్ లోనూ ఆధిపత్య పోరు నడిచింది..ఇలా ఒకటి ఏంటి చాలా స్థానాల్లో అదే పరిస్తితి..మొత్తానికి ఆత్మీయ సమ్మేళనమే కారు పార్టీలో చిచ్చు రేపింది.