పోలవరం వెనుక జలాల ప్రభావంపై.. నేడు దిల్లీలో సాంకేతిక కమిటీ భేటీ

పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ప్రభావంపై నేడు దిల్లీలో కేంద్ర జలసంఘం సాంకేతిక కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో మరోమారు ముంపు ప్రభావంపై గట్టి వాదనలను వినిపించేందుకు తెలంగాణ సిద్ధమైంది.

ప్రాజెక్టు నిర్మాణం వల్ల 891 ఎకరాల భూమితో పాటు ఆరు గ్రామాలు మునుగుతాయని పేర్కొంది. పోలవరం వల్ల ముంపుపై తెలంగాణ లేవనెత్తిన అంశాలను ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర జలసంఘం తిరస్కరిస్తున్న నేపథ్యంలో 10 అంశాలతో కూడిన లేఖను మ్యాప్‌లు, ఇతర ఆధారాలతో సహా పంపినట్లు సంబంధితవర్గాల ద్వారా తెలిసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నేతృత్వంలో తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల అభిప్రాయాలను సీడబ్ల్యూసీ నమోదు చేస్తోంది. సమావేశానికి తెలంగాణ నుంచి ఈఎన్‌సీ మురళీధర్‌ హాజరుకానున్నారు. ఈక్రమంలో మంగళవారం హైదరాబాద్‌ జలసౌధలో ప్రాజెక్టు ముంపుపై ఇంజినీర్లు కసరత్తు చేశారు.