ఎంఐఎం పార్టీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్ తరాలకు తెలంగాణ చరిత్రను తెలియజేసేందుకు ఫొటో ఎగ్జిబిషన్లు ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే నగరం నడిబొడ్డున భారత మాజీ హోంమంత్రి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని వెల్లడించారు బండి సంజయ్.
కాంగ్రెస్ సర్కార్ ఎంఐఎం ఒక్కటయ్యాయని.. అందుకే ఎంఐఎంకి కాంగ్రెస్ భయపడుతుందని పేర్కొన్నారు. నిన్న సెప్టెంబర్ 17న బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించిందని.. కానీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల స్థానంలో ప్రజా పాలన దినోత్సవం పేరుతో ఎందుకు వేడుకలు నిర్వహించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ఉద్యమకారులను, రజాకారులపై చేసిన పోరాట యోధులను అందరినీ సన్మానించడం జరిగిందని గుర్తు చేశారు.