‘కారు’తో ఢీ కి రాములమ్మ రెడీ ? కేసీఆర్ రెడీనా ?

-

లేడీ ఫైర్ బ్రాండ్ గా తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి అలియాస్ రాములమ్మకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మొదట్లో ఆమె బీజేపీ నుంచి టిఆర్ఎస్ లో చేరి, ఆ తర్వాత ఎంపీగా గెలుపొందారు. కెసిఆర్ ప్రభుత్వంలో విజయశాంతి యాక్టివ్ గా ఉంటూ కెసిఆర్ కు సొంత చెల్లెలుగా వ్యవహరించేవారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం, ఆమె టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. ఇక అప్పటి నుంచి టిఆర్ఎస్ ను విమర్శించే సందర్భం ఏది వచ్చినా వదిలిపెట్టకుండా విమర్శల బాణాలు వదులుతూనే వస్తున్నారు. అయితే ఆమెకు రాజకీయంగా ఏ పదవి లేకపోవడంతో, చాలా కాలం నుంచి సరైన పదవి కోసం ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, దుబ్బాక టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మృతి చెందడంతో, అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అక్కడ కాంగ్రెస్ తరఫున రాములమ్మ రంగంలోకి దిగాలని ప్రయత్నిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండడం, కాంగ్రెస్ కు ఆదరణ ఏమాత్రం తగ్గకపోవడం, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ గాలి బలంగా వీచినా, రెండో స్థానానికి కాంగ్రెస్ రావడం వంటి పరిణామాలను బేరీజు వేసుకుని, ఆమె దుబ్బాక ఎన్నికల్లో పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి పై విజయం సాధించి, కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టాలని, టిఆర్ఎస్ ప్రభుత్వ హవా మరింతగా తగ్గించాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం దుబ్బాక లో బిజెపి నేత రఘునందన్ రావు మినహా, బలమైన నాయకుడు ఎవరు పెద్దగా లేకపోవడంతో తన విజయం నల్లేరు మీద నడకే అవుతుందని అంచనా వేస్తోంది. కాగా, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రాములమ్మ మాత్రం తానే అక్కడి అభ్యర్థిగా రంగంలోకి దిగుతాననే సంకేతాలు ఇస్తుండడంతో, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే, టిఆర్ఎస్ కు అది పెద్ద సవాలే. ఆమె టీఆర్ఎస్ పై విమర్శలు చేయడమే కాదు… ఆ విమర్శలపై చర్చ జరిగే విధంగా చేయగలగడంలో దిట్టగా ఆమెకు పేరు ఉండటంతో, టిఆర్ఎస్ కూడా కాస్త కంగారు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news