మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి- ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. సమయం దొరికినప్పుడల్లా పరోక్షంగా వీరు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం సాధారణంగా మారింది. అయితే వచ్చే ఎన్నికలలో కడియం మళ్లీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని, అందులో భాగంగానే ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్యకు చెక్ పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘనపూర్ లో అవినీతి పెరిగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇచ్చిన ఖడ్గంతో అవినీతిని అంతమొందించడానికి కృషి చేస్తానని అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో అవినీతిని రూపుమాపుతానని హామీ ఇచ్చారు. తనకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు. ఇక స్టేషన్ ఘనపూర్ లో బంజారా భవన్ తో పాటు సేవాలాల్ భవన్ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.