డీఎస్ ఇలాకాలో న‌యా ఈక్వేష‌న్ .. ఇది ఫిక్స్ భ‌య్యా!

ఈ సారి నిజామాబాద్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగేలా ఉన్నాయి…రాజకీయ ఉద్ధండులు ఉన్న జిల్లాలో ఈ సారి ట్రైయాంగిల్ ఫైట్ జరిగేలా ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు నడవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలాగో మూడు పార్టీల్లో బడా బడా నేతలు ఉన్నారు. అయితే డి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరనుండటంతో జిల్లా రాజకీయాలు మరింత మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల్లోనే డి. శ్రీనివాస్ తన పెద్ద కుమారుడు డి.సంజయ్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరనున్న విషయం తెలిసిందే.

ఇక సొంతగూటికి చేరుకొనున్న డీఎస్…ఇంకా కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయనున్నారు. అయితే వయసు మీద పడటంతో ఆయన మళ్ళీ పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. సలహాల వరకే ఆయన పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. అదే సమయంలో తన కుమారుడు సంజయ్‌ని ఎన్నికల బరిలో దింపనున్నారు. తనకు కలిసొచ్చిన నిజామాబాద్ రూరల్ లేదా అర్బన్ స్థానాల్లో సంజయ్‌ని నిలబెట్టే ఛాన్స్ ఉంది. సంజయ్ కూడా ఈ రెండు సీట్లలో ఏ సీటు వచ్చిన పర్లేదు అనుకుంటున్నారు.

సరే డీఎస్ పెద్ద కుమారుడు పరిస్తితి అలా ఉంటే…చిన్న కుమారుడు అరవింద్ బీజేపీలో కీలకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. నిజామాబాద్ ఎంపీగా ఉన్న  ఆయన, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని చూస్తున్నారని తెలిసింది. ఎలాగో పార్లమెంట్ ఎన్నికలు తర్వాత జరుగుతాయి కాబట్టి ముందు అసెంబ్లీలో దిగాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కూడా ఆర్మూర్ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది.

ఒకవేళ ఆర్మూర్ కాకపోతే హైదరాబాద్‌ నగరంలో ఏదొక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికైతే ధర్మపురి బ్రదర్స్ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడం ఖాయమని చెప్పొచ్చు. కాకపోతే వేరు వేరు పార్టీల్లో పోటీకి దిగుతారు.