టీ పాలిటిక్స్‌లో ట్విస్ట్‌… సొంత గూటికే లేడీ ఫైర్‌బ్రాండ్‌…!

-

తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రీ ముఖ్యంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఇలాఖాలో ప్ర‌ధ‌మంగా వినిపించే పేరు డీకే అరుణ‌. గ‌ద్వాల‌ని కంచుకోట‌గా చేసుకుని త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని సాగించిన ఈ గ‌ద్వాల జేజ‌మ్మ రాష్ట్ర రాజ‌కీయాల్లో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. ఒక ద‌శ‌లో జిల్లా రాజ‌కీయాల్లో తెరాస‌కు కొర‌కాని కొయ్య‌గా మారిన ఆమె గులాబీ ద‌ళ‌ప‌తికి గ‌ట్టి పోటీనే ఇచ్చింద‌ని చెప్పాలి. వైఎస్ హ‌యాంలో మంత్రిగా చ‌క్రం తిప్పిన డీకే అరుణ ఆ త‌రువాత నుంచి రాష్ట్ర రాజ‌కీయాల్లో తెరాస కార‌ణంగా, జిల్లాలో ఆధిప‌త్య పోరు కార‌ణంగా త‌న ప్రాభ‌వాన్ని కోల్పోతూ వ‌చ్చింది. 2004 ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన చరిత్ర అరుణ‌ది.


ఇక వైఎస్సార్ హ‌యాంలో మంత్రి అయిన ఆమె ఆ త‌ర్వాత ఆయ‌న మ‌ర‌ణాంత‌రం మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కార‌ణంగా తెరాస‌ ఒత్తిడికి త‌ట్టుకోలేక పోయారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీగా పోటీ చేసి గ‌ట్టి పోటీ ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాల కార‌ణంగా అరుణ కాంగ్రెస్‌లో వుండ‌లేక తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఆ త‌ర్వాత అరుణ బీజేపీలో చేరినా కాంగ్రెస్‌లో చ‌క్రం తిప్పిన‌ట్టుగా బీజేపీలో తిప్ప‌లేక‌పోతున్నారు.

పార్టీలో ఆమెకు ప్రాధాన్య‌తే క‌నిపించ‌డం లేదు. ఆమెని ప‌ట్టించుకున్న బీజేపీ వ‌ర్గాలే లేవంటే అతిశ‌యోక్తి కాదేమో. 2019లో మోడీ హ‌వా అంటూ బీజేపీ తీర్థం పుచ్చుకున్న డీకే అరుణ్ అక్క‌డి నుంచి త‌న ప్రాభ‌వాన్ని, జిల్లాపై ప‌ట్టునూ క్ర‌మంగా కోల్పోతూ వ‌స్తోంది. దీంతో జ‌రుగుతున్న న‌ష్టాన్ని గ‌మ‌నించి వెంట‌నే మేల్కొన్న డీకే అరుణ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన రేవంత్‌రెడ్డి ఇందు కోసం పావులు క‌దుపుతున్నార‌ట‌. ఇద్ద‌రూ ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డంతో డీకే అరుణ్ కాం‌గ్రెస్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

గ‌తంలో వీరిద్ద‌రు రాజ‌కీయంగా శ‌త్రువులుగా ఉన్నా ఇప్పుడు త‌మ ప్రాభ‌వం కోసం మ‌ళ్లీ ఒక్క‌ట‌య్యార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. పైగా ఇప్ప‌టికే కాంగ్రెస్ సీనియ‌ర్‌లు ఆమెతో ట‌చ్‌లోనే వున్నార‌ట‌. ఇదే అమెకు కొండంత బ‌ల‌మ‌ని, మ‌ళ్లీ కాంగ్రెస్‌లో చేరితేనే మునుపటి ప్రాభ‌వాన్ని మ‌ళ్లీ సొంతం చేసుకోవ‌చ్చ‌ని జిల్లాలో త‌మ క్యాడ‌ర్‌ని మ‌ళ్లీ బ‌లోపేతం చేసుకోవ‌చ్చ‌ని డీకే అరుణ‌కు స్థానిక‌ కార్య‌క‌ర్త‌లు చెబుతున్నార‌ట‌. కాంగ్రెస్‌లో రీఎంట్రీకి ఇంత కంటే మంచి స‌మ‌యం దొర‌క‌ద‌ని డీకే అరుణ‌ కూడా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు తాజాగా రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news