కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సానుభూతి డ్రామాలను నమ్మవద్దని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒక రాజకీయ పార్టీ సెంటిమెంట్ నే బలంగా నమ్ముకుందని అన్నారు. రాజగోపాల్ రెడ్డికి జ్వరం వచ్చిందని.. దుబ్బాకలో చేసినట్టు బిజెపి చేస్తుందని ఆరోపించారు. బిజెపి నేతలు కావాలనే వారిపై వారే దాడి చేయించుకునే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బిజెపి వారు కేసీఆర్ ను తిడుతున్నారు కానీ మునుగోడుకు బిజెపి ఏం చేసిందని మాత్రం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుబ్బాక, హుజురాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి కోటి రూపాయలైనా తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బిజెపి మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని సూచించారు. గత ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మూడున్నర ఏళ్లుగా ఒక్కసారి కూడా గ్రామాల వైపు చూడలేదని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి టిఆర్ఎస్ గెలుపుతోనే జరుగుతుందని చెప్పారు. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.