తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పోస్ట్ పై మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలనుకుంటున్నారని తెలిపారు. ఐదుగురు ముఖ్యమంత్రులతో తాను కొట్లాడానన్నారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే.. దమ్మున్నోడు కావాలని.. గల్లీల్లో కొట్లాడేవాళ్లు కాదన్నారు.
నా లాంటి వాళ్లు ఊరికే మాట్లాడరని.. సందర్భం వచ్చినప్పుడు జేజెమ్మలతో కొట్లాడమని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈ ముఖ్యమంత్రితో కూడా కొట్లాడతానన్నారు. అయితే ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. బీజేపీ స్టేట్ చీఫ్ గా దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడేవాళ్లు కావాలని అందరినీ కలుపుకుని పోయే వాళ్లయితేనే బెటర్ అని హైకమాండ్ కి సూచించారు. అయితే ఈటల, రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. జేజెమ్మ అంటే ఎవ్వరు అనే సందేహం కలుగుతుండటం గమనార్హం.