రేవంత్ రెడ్డి చేసిన పాపం రాష్ట్ర ప్రజలకు శాపం కావద్దని వేములాడ రాజన్నను మొక్కుకున్నా.. జ్ఞానోదయం చేయాలని వేడుకున్నా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వేములవాడ రాజన్న దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు… ఎంతో భక్తితో ప్రజలు రాజరాజేశ్వర స్వామిని కొలుస్తారు. కోరిన మొక్కులు చెల్లిస్తారన్నారు. పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తా అని సిఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద ఒట్టు వేసి మాట తప్పాడని ఫైర్ అయ్యారు.
పాలకుడే పాపం చేస్తే రాష్ట్రానికి అరిష్టమవుతుంది, ప్రజలకు శాపమవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని… పంటలకు మద్దతు ధర రాక, అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. మద్దతు ధర రాక దళారులకు పంట అమ్ముతున్నారని… పౌరసరఫరాల మంత్రిగా గంగుల కమలాకర్ ఉన్నప్పుడు.. బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి గింజ దాకా కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.
వడ్లకు బోనస్ ఇచ్చాం అని మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. రైతుబంధు ఎగ్గొట్టిండు, యాసంగి పంటకు అయినా ఇచ్చేలా చూడు అని దేవుణ్ణి కోరుకున్నా అన్నారు. దేవుళ్ల మీద ఓట్లు పెట్టిన మాట తప్పింది రేవంత్ రెడ్డి… భయం లేదు, భక్తి లేదు అన్న అనుమానం వస్తున్నదని ఫైర్ అయ్యారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అన్నారు మాట తప్పారని… రూ. 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు ఎందుకు డబ్బులు కట్టాలని కోరారు.