ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే ప్రతీ ఒక్క పేదవాడికి ఉచితంగా వైద్యం అందించి మందులను ఏ ఒక్కటి లేదనకుండా అన్ని మందులను మనమే ఉచితంగా అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా అధికారులను ఆదేశించారు. సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన స్థానిక ఎమ్మెల్యే, ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ చార్జీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో పాటు జిల్లా వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ ఇప్పటికే ఆసుపత్రి అప్డేట్ అయి 100 పడకల ఆసుపత్రిగా మారిందని దీనికి కావాల్సిన వసతులు సౌకర్యాల గురించి చర్చించారు. హాస్పిటల్ లో మౌళిక సదుపాయాలు కల్పనకై ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే పేద వాడికి ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రిపై భరోసా కోల్పోకూడదని అధికారులకు సూచించారు. పేదవారికి విశ్వాసం కలగాలని.. విశ్వాసం కోల్పోకూడదన్నారు. ఆసుపత్రుల్లో ఉన్న సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రస్తుతం 45 శాతం పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని.. 75 శాతానికి పెంచేవిధంగా అధికారులు పని చేయాలన్నారు.