గులాబీ దండు దోపిడీలు పెచ్చుమిరిపోతున్నాయి – కిషన్ రెడ్డి

రాష్ట్రంలో గులాబీ దండు దోపిడీలు పెచ్చుమీరిపోతున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ మోడల్ అని గొప్పగా చెప్పుకుంటూ.. సగం రోజులు ప్రగతిభవన్లో, సగం రోజులు ఫామ్ హౌస్ లో ఉంటున్న మీకు ఏం చూసి దేశ ప్రజలు స్వాగతం పలకాలని మండిపడ్డారు.

బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం ధర్నాలు, నిరసనలు చేయాల్సిన అవసరం లేదని మరో కేసీఆర్ కుటుంబ సభ్యుడు అంటారని.. రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారం నెలకొల్పి పదివేల మందికి ఉపాధి కల్పిస్తామని కేసీఆర్ వాగ్దానం చేశారని అన్నారు. చేతనైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని అన్నారు. కల్వకుంట్ల కుటుంబీకులు ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. వాస్తవాలు చెబితే తన దిష్టిబొమ్మలు ఎందుకు తగలబెట్టారో కెసిఆర్ సమాధానం చెప్పాలని అన్నారు.

ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల ఆక్రమణలు చేస్తూ గులాబీ దండు దోపిడీలకు తెగబడుతుందన్నారు. కెసిఆర్ కుటుంబం నుంచి, అధికార టీఆర్ఎస్ నుంచి ప్రజలు తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో ఏం ఉద్ధరించారని ఇప్పుడు జాతీయ పార్టీ అంటున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్, మజిలీస్ పార్టీలు ప్రజాధనం దోచుకోవడం తప్పితే చేసిందేమీ లేదన్నారు.