శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని మొన్నటి దాకా ఊహాగానాలు వినిపించాయి. అయితే నల్గొండ లేదా భువనగిరి లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక చోట బీఆర్ఎస్ అభ్యర్థిగా కచ్చితంగా పోటీ చేస్తారని భావించిన ఆయన ఇప్పుడు బరిలో నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. ఇదే విషయంలో నల్గొండ లేదా భువనగిరి స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి కచ్చితంగా అవకాశం కల్పిస్తామని, బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని కేటీఆర్, హరీశ్‌రావులు అమిత్ను ఒప్పించినట్లుగా తెలిసింది.
అయితే గుత్తా అమిత్‌కు టికెట్ ఇచ్చే విషయమై నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఎక్కడ టికెట్ ఇచ్చినా పార్టీ శ్రేణులు సహకరించేది లేదని తేల్చిచెప్పడంతో గుత్తా అమిత్‌రెడ్డి పోటీలో నిలవడం సందిగ్ధంలో పడింది. స్థానికంగా పార్టీ నేతలు సహకరించనప్పుడు.. పోటీ చేయాల్సిన అవసరం తమకు లేదని గుత్తా అమిత్ పార్టీ అధిష్ఠానానికి స్పష్టంగా చెప్పినట్లుగా టాక్.