జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరముందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాదనుకున్న తెలంగాణను తెచ్చి అభివృద్ధిలో తీసుకెళ్తున్న గొప్ప నాయకుడని పేర్కొన్నారు. సీఎం కేసీఅర్ సారథ్యంలో అభివృద్ది, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి దిక్సూచి నిలుస్తుందన్నారు. ఇప్పుడు దేశంలో గుణాత్మక మార్పు అవసరమని, అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు.
ఈ పరిస్థితుల్లో కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయని చెప్పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే అన్ని విషయాలపై పట్టున్న కెసిఆర్ లాంటి సమర్థ నాయకుడి వల్లే సాధ్యమవుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎండగడుతూ… దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలను, ముఖ్య నేతలను ఏకం చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. మరోవైపు సీఎం కేసీఅర్, ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు.
రాష్ట్ర గవర్నర్ తమిలి సై ఒక రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. రాజ్ భవన్ ను ఆమె రాజకీయ భవన్ గా మార్చారని గవర్నర్ తీరును తప్పు పట్టారు. పద్ధతి మార్చుకోకుంటే గతంలో ఎన్టీఆర్ హయాంలో గవర్నర్ గా పనిచేసిన రాంలాల్ కు పట్టిన గతే పడుతుందన్నారు.. అప్పట్లో రామ్ లాల్ ఇలాగే రాజకీయాలు చేసి ప్రజాగ్రహానికి గురయ్యారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ది ని అన్ని రాష్ట్రాలు ప్రశంసిస్తుంటే…. గవర్నర్కు మాత్రం ఇవేమీ కనిపించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా గవర్నర్ తన పద్ధతిని మార్చుకోవాలని, సీఎం కేసీఆర్ ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.