టీ-కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్..సీనియర్ల పంతం నెగ్గింది?

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లు అంతర్గత యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో ఈ రచ్చ జరుగుతుండగా, ఈ మధ్య పదవుల పంపకాల్లో మరింత పెరిగింది. టీడీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఉత్తమ్, భట్టి లాంటి సీనియర్లు ఫైర్ అయ్యారు. దీంతో టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇలా రచ్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి దిగ్విజయ్ సింగ్ వచ్చి..పార్టీలోని పరిస్తితులని చక్కదిద్దే కార్యక్రమం చేశారు.

అందరి ఫిర్యాదులని తీసుకున్నారు..అంతా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి..నేతల సమస్యలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయితే ఇందులో సీనియర్ల ఫిర్యాదులు వచ్చి..రేవంత్ రెడ్డి సీనియర్లని కలుపుకొవడం లేదని, ఒంటెద్దు పోకడలతో వెళుతున్నారని, కాబట్టి ఆయన్ని పి‌సి‌సి పదవి నుంచి తప్పించాలని ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్..కేవలం రేవంత్ చెప్పినట్లే చేస్తున్నారు..రేవంత్‌కు అనుకూలంగా ఉన్నారని, ఆయన్ని తప్పించాలని డిమాండ్ చేశారు.

 

అయితే సీనియర్ల ఫిర్యాదులని తాజాగా దిగ్విజయ్ అధిష్టానానికి వివరించినట్లు తెలిసింది. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డిని పి‌సి‌సి పదవి నుంచి తప్పించే యోచన అధిష్టానానికి లేదు..కానీ మాణిక్కంని మాత్రం తప్పించడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే ఏడాది కొత్త ఇంచార్జ్‌ని పెడతారని తెలుస్తోంది. మొదట దిగ్విజయ్‌ని ఇంచార్జ్‌గా వెళ్లాలని కోరినట్లు తెలిసింది. ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది.

దీంతో కాంగ్రెస్ అధిష్టానం ముగ్గురు పేర్లని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.. హర్యానాకు చెందిన రాజ్యసభ ఎంపీ రణదీప్ సుర్జేవాలా , ఎంపీ పన్నాలాల్ పునియాలతో పాటు మహారాష్ట్రకు చెందిన మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్‌ల్లో ఎవరో ఒకరిని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా పంపుతారని తెలుస్తోంది. మరి చూడాలి కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో.

Read more RELATED
Recommended to you

Latest news