ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి కాళేశ్వరం ఎత్తిపోతలను గురువారం సాయంత్రం నిలిపివేశారు. ఎస్సారెస్పీ, ఇతర ప్రాజెక్టుల చివరి ఆయకట్టు స్థిరీకరణ నిమిత్తం సీఎం కేసీఆర్ ఆదేశాలతో జనవరి 6న నీటిపారుదల శాఖ అధికారులు ఎత్తిపోతల మోటార్లను ప్రారంభించారు. మూడున్నర నెలలపాటు నంది, గాయత్రి పంపుహౌస్‌ల నుంచి మధ్య మానేరుకు అక్కడి నుంచి దిగువ మానేరుకు 31 టీఎంసీల నీటిని తరలించారు. ఈ రెండు జలాశయాల నుంచి కాలువల ద్వారా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని 11.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించారు.
ఎత్తిపోతల మోటార్లను ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు నడిపారు. ఈ సమయంలో విద్యుత్తుకు డిమాండ్, యూనిట్ ధర కూడా తక్కువగా ఉండటంతో ఇలా చేశారు. యాసంగి, వానాకాలం సీజన్లలో కలిపి ఈ సంవత్సరం మొత్తం 38.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు.
గత వానాకాలంలోనూ 7.5 టీఎసీల నీటిని ఎత్తిపోసి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ జలాశయం, మల్లన్నసాగర్‌లకు తరలించారు. వాటి పరిధిలో ఈ యాసంగిలో సాగు, తాగునీటి అవసరాలు తీరాయి.