సీజనల్ వ్యాధులు, బూస్టర్ డోసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

-

హైదరాబాద్ లోని MCRHRD నుండి అన్ని జిల్లాల వైద్యాధికారులతో సీజనల్ వ్యాధులు, బూస్టర్ డోసు, సి సెక్షన్లు, బూస్టర్ డోసు, ఎన్ సీ డీ స్క్రీనింగ్ తదితర అంశాలపై రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వచ్చే నెల రోజులు ఎంతో కీలకమన్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డెంగీ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, వెంటనే చికిత్స అందించాలని చెప్పారు.

ఒకవైపు అవగాహన పెంచడం, మరో వైపు సత్వర చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకోకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకునెలా చూడాలన్నారు. చికిత్స, రోగ నిర్ధారణ పరీక్షల సేవల గురించి అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్, పంచాయతీ శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పారిశుద్ధ్యం పట్ల అవగాహన పెంచాలన్నారు. నీటి నిల్వ లేకుండా చూడటం, ఫాగింగ్, ఫ్రై డే డ్రై డే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. తద్వారా దోమలు, ఈగల నియంత్రణ జరిగేలా చూడాలన్నారు. వర్షాలు, వరదల సమయంలో జిల్లా వైద్యాధికారులు సమన్వయంతో పని చేశారని, స్టాఫ్ నర్సులు, ఆశాలు, ఇతర సిబ్బంది అందరూ కృషి చేసి మంచి సేవలు అందించారని అభినందించారు.

అయితే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంకా బాగా పని చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రతి పి హెచ్ సి లో కుక్క, పాము కాటు మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. సబ్ సెంటర్ల వారీగా జరుగుతున్న ఎన్ సీ డీ స్క్రీనింగ్ త్వరగా వంద శాతం పూర్తి అయ్యేలా చూడాలన్నారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలను మంత్రి అభినందించారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంతో బూస్టర్ డోసు పంపిణీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

బూస్టర్ డోసు చాలా ముఖ్యమని, అర్హులందరికి వేసేలా రాష్ట్ర వ్యాప్తంగా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అన్నారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎంపీలు, ఎమ్మేల్యేలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో వాక్సినేషన్ వేగంగా నిర్వహించాలని, ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వారానికి రెండు మూడు రోజులు జిల్లాల్లో పర్యటిస్తూ, పురోగతిపై సమీక్షలు నిర్వహించాలని, వచ్చే పది రోజుల్లో వాక్సినేషన్ వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని డిహెచ్ శ్రీనివాస్ రావును మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 2,77,67,000 మందిని అర్హులుగా గుర్తించగా, ఇప్పటి వరకు 12,87,411 మందికి బూస్టర్ పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీకి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందన్నారు. 20 లక్షల పైగా డోసులు నిల్వ ఉన్నాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news