తెలంగాణలో మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. అయితే తిరిగి మరోసారి ఎన్నికల వాతావరణం తెలంగాణలో నెలకొనబోతోంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మన్నటి వరకూ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బొగ్గు సంఘం నాయకులు కాస్త నిరాశకు గురయ్యారు.
కేసీఆర్ తనయ కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తాము పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్థ కోసం, సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు. వాటిని చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటేసి టీబీజీకేఎస్ సంఘాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ బాణం గుర్తుపై ఓట్లేసీ భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.