ఉద్యమ సమయంలో దళిత వర్గాలను మభ్యపెట్టేందుకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ వేదికగా జరిగిన బహిరంగ సభలోనూ తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి అని ప్రకటించారని.. కేసీఆర్ మాట చెబితే.. తల నరుక్కుంటారు కానీ మాట తప్పనని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఎందుకు ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 20శాతానికి పైగా ఉన్న దళిత, అణగారిన వర్గాలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలనే కుట్ర ఎలా చేయగలిగారని ప్రశ్నిస్తూ.. కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ రాశారు.
“ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజానీకం వాస్తవాలను గ్రహిస్తోంది. బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే కేటీఆర్ అవహేళన చేశారు. కులం ముఖ్యం కాదు గుణం ముఖ్యం అంటున్నారు. ఇది చాలదా మీ కుటుంబానికి బీసీల పట్ల.. అగౌరవానికి నిదర్శనం. కేసీఆర్ మాట, నీటి మూట అని నిరూపించారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న మీరే.. వడ్డించిన విస్తరిలా, మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని మీ కుటుంబానికి వడ్డించారు. ఉద్యమ సమయంలో అమెరికాలో ఉన్న మీ కుమారుడిని, కూతురిని తెలంగాణ ప్రజలపై రుద్దారు.” అని కిషన్ రెడ్డి లేఖలో ధ్వజమెత్తారు.