మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇవాళ స్పీకర్‌కు తన రాజీనామా లేఖను అందజేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు స్పీకర్ తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేయనున్నారు.
రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే.. ఆరు నెలల లోపు మునుగోడు ఉప ఎన్నిక రావడం ఖాయం. దీంతో రాజీనామాను స్పీకర్ తనకు అందిన వెంటనే ఆమోదిస్తారా..? లేక న్యాయ సలహా తీసుకుని ఆమోద ముద్ర వేస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల కోసమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపిన ఆయన.. అవమానాలు భరిస్తూ ఉండలేనన్నారు. రాజీనామా నిర్ణయం తన స్వార్థం కోసం కాదని.. మునుగోడు అభివృద్ధి కోసమేనని ఉద్ఘాటించారు. ప్రజలు కోరుకుంటే మళ్లీ మునుగోడు నుంచి పోటీ చేస్తానన్నారు. తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు.