పాలన చేతకాక పనికిమాలిన మాటలు.. .. పాగల్ పనులు. వెరసి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీపై రేవంత్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్…. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందని ఫైర్ అయ్యారు. మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఆగ్రహించారు.
మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయం లో (పర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ అయిందని వెల్లడించారు. మూసీ ప్రాజెక్టులో 1,50,000 కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం సాధించిందని తెలిపారు. బిల్డర్లను, రియల్టర్లను బెదిరించకుండానే ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని లెక్కలు బయట పెట్టారు. మీ బడే భాయ్ మోడీ ITIR ని రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చెయ్యకపోయినా, IT ఎగుమతులలో 2035 లో చేరుకోవాల్సిన టార్గెట్ ని పదకొండేళ్ల ముందే 2023 లో చేర్చిన ఘనత కెసిఆర్ నాయకత్వానిదని పేర్కొన్నారు. దిల్లీకి డబ్బు సంచులు పంపకుండానే తెలంగాణ విత్తన భాండాగారమైంది. దేశంలోనే ధాన్యరాశిగా మారిందన్నారు.