పిల్లల్ని నెమలీకలు తీసుకెళ్లనివ్వండి.. అటవీ అధికారులకు కేటీఆర్ రిక్వెస్ట్

-

నెమలీకలను చూస్తే పిల్లలు భలే గెంతులేస్తారు. వాటిని భద్రంగా తమ పుస్తకాల్లో దాచిపెట్టుకుంటారు. నెమలీకలు ఎక్కడ కనిపించినా వెంటనే తీసేసుకుంటారు. అలా కేబీఆర్ పార్కుకు వెళ్లే పిల్లలు కూడా నెమలీకలను తీసుకెళ్తుండగా.. అక్కడి అధికారులు మాత్రం వాళ్ల దగ్గరి నుంచి లాగేసుకుంటున్నారు. దీంతో పిల్లలు ఒకటే మారాం చేస్తున్నారు. వారిని సముదాయించడం తల్లిదండ్రులకు కష్టంగా మారుతోంది. ఈ విషయంపైనే ఓ మహిళ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​కు లేఖ రాశారు. దానికి మంత్రి రియాక్షన్ ఏంటంటే..?

హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్కులో నెమలీకలను పిల్లలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని అటవీ అధికారులను మంత్రి కేటీఆర్‌ కోరారు. తమ అయిదేళ్ల కుమారుడు వేదాంత్‌కు నెమలీకలంటే బాగా ఇష్టమని, పార్కుకు వచ్చినప్పుడు వాటిని ఏరుకొని తీసుకెళ్తుండగా అధికారులు అడ్డుకొని లాక్కుంటున్నారని పేర్కొంటూ అతని తల్లి కేటీఆర్‌కు లేఖ రాశారు. వాటిని స్టోర్‌రూమ్‌లో పెట్టడం కంటే పిల్లలకిస్తే మధురానుభూతి పొందుతారని, ఇందుకు అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై కేటీఆర్‌ వెంటనే స్పందించారు.

‘‘ఒక చిన్నారి బాబు తల్లి రాసిన లేఖ నన్ను ఎంతగానో కదిలించింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నెమలీకలను తీసుకెళ్లడం నిషిద్ధమంటూ అటవీ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. కేబీఆర్‌ పార్కు అధికారులు పిల్లలకు ఈ విషయంలో మినహాయింపునివ్వాలి’’ అని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news