లోక్‌సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్‌ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ని పూర్తిగా తిరస్కరించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడం తో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీ తో చేజారిపోయాయి.
ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదాం. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రేస్ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైంది. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలం లో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం అన్నారు. 1983 లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన అనంతర రాజకీయపరిణామాలను గమనిస్తే ఈ విషయం అర్థమౌతుంది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పి ని తిరస్కరించి కాంగ్రేస్ గెలిపించిన ప్రజలు కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రేస్ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రేస్ పార్టీ అనంతరం జరిగిన నాటి లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యింది. ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీ ని తిరిగి భారీ మెజారిటీ తో గెలిపించిన సంగతి తెలిసిందే.