బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 21న అంటే సోమవారం రోజు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి జాబితాలో మొత్తం 80 మంది పేర్లు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ మొదలైంది. వీరిలో ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని మార్చాలని బిఆర్ఎస్ యోచిస్తున్నట్లుగా సమాచారం.
ఉప్పల్ నియోజకవర్గంలో బండారి లక్ష్మారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఈ ప్రచారంతో ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్. ప్రస్తుతం ఈ రెండు వర్గాలు ఒకటయ్యాయి. ఈ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇవ్వాలని నేతలు కోరారు. తమ ఇద్దరిలో ఒకరికి టికెట్ కేటాయించాలని.. ఇతర నేతలకు ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని వారికి హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత.