మా పార్టీకి చెందిన కొందరు నాయకులు, పార్టీకి నష్టం చేకూరేలా చేస్తోన్న అవాంఛనీయ బహిరంగ ప్రకటనలు, మీడియా లీకులు, యథాలాపంగా చేస్తోన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి కే. కృష్ణ సాగర్ రావు. ఇలాంటి ప్రకటనలు, వ్యాఖ్యలు చేస్తోన్న వాళ్లు తాము అసలు ఏ పార్టీలో ఉన్నామో మర్చిపోయినట్టున్నారని.. ఇది బీజేపీ అని గుర్తు చేశారు. బీఆర్ఎస్సో, కాంగ్రెస్సో కాదన్నారు. పార్టీనీ, పార్టీ నాయకత్వాన్నీ బహిరంగంగా విమర్శించే సంస్కృతి, వ్యవస్థ బీజేపీలో లేవు, ఉండవన్నారు.
ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తోన్న వాళ్లంతా దాదాపు ఏదో ఒక రాష్ట్ర, జాతీయ స్థాయి కమిటీల్లో ఉన్నవాళ్లేనని.. వాళ్లకు తమ గొంతు వినిపించడానికి పార్టీ తగిన అవకాశం, వేదిక కూడా ఇచ్చిందన్నారు. పార్టీ ఎజెండా కంటే వ్యక్తిగత ఎజెండాలు ఎప్పటికీ ఎక్కువ కాదని.. పార్టీలో ఒక ‘లక్ష్మణ రేఖ’ ఉందని మర్చిపోకూడదన్నారు. పార్టీపైనా, పార్టీ నాయకత్వంపైనా బాధ్యతారాహిత్యమైన, అవాంఛనీయమైన ప్రకటనలు చేయడం అంటే పార్టీని నష్టపరచాలనే ఉద్దేశాన్ని బహిరంగంగా చెప్పినట్లేనన్నారు. మా పార్టీలో ఈ తరహా క్రమశిక్షణా రాహిత్యం, నిర్లక్ష్యపూరిత వైఖరి సహించబడదన్నారు.