అనుమానం పెనుభూతం : గొడ్డలితో భార్యను నరికి.. ఆత్మహత్య చేసుకున్న భర్త

-

అనుమానం పెనుభూతమై కొత్తజంటను బలితీసుకుంది. పెళ్లయి రెండు నెలలు కూడా కాకముందే రెండు నిండు జీవితాలు ముగిసిపోయాయి. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త పురుగు మందు తాగి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరులో ఈ విషాదం చోటుచేసుకుంది.


స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తాళ్ల హరీశ్‌ (26)కు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరిదేవిపేటకు చెందిన నాగేశ్వర్‌రావు-శ్రీదేవి దంపతుల పెద్ద కుమార్తె పుష్పలీల (19)తో జూన్‌ 17న వివాహమైంది. హరీశ్‌కు సోదరుడు, అక్క ఉన్నారు. తల్లి పదేళ్ల కిందటే మృతి చెందగా తండ్రి కూలీ పనిచేస్తుంటారు.
పెళ్లయినప్పటి నుంచే పుష్పలీలపై అనుమానం పెంచుకున్న హరీశ్‌ శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఇదే విషయమై ఆమె తన తల్లిదండ్రులకు వివరించగా ఎందుకు చెప్పావంటూ ఓ సారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

చికిత్స అనంతరం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ చేసి వారిని కలిపారు. కాగా పుష్పలీల ఫోన్‌లో తన తల్లిదండ్రులతో మాట్లాడితే ఇంకా ఎవరితోనో మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్న హరీశ్‌ వేధింపులు ఎక్కువ చేశాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన హరీశ్‌ రాత్రి మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఆమె నిద్రకుఉపక్రమించాక గొడ్డలితో మెడపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

తరువాత బయటకొచ్చి పురుగులుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఇరుగుపొరుగు వారు గమనించి ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు. కుమార్తెను కడసారి చూసేందుకు వద్దామన్నా బస్‌ఛార్జీలకు డబ్బులు లేని పేదరికం తల్లిదండ్రులది. బంధువులు ఫోన్‌పేలో అక్కడున్నవారికి డబ్బులు పంపిస్తే సాయంత్రానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు.

Read more RELATED
Recommended to you

Latest news