కేటీఆర్ సన్నిహితుడే..అయినా ఆ మత్రి పట్టు సాధించలేక పోతున్నారా ?

-

కాబోయే సీఎం అంటున్న కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడని ఆ మంత్రికి పేరుంది. ఇక జిల్లాలో పవర్స్ మొత్తం ఆ అమాత్యునికే అప్పగించారు కానీ జిల్లా పై పట్టు సాధించలేకపోతున్నారు. అన్ని పవర్స్ ఉన్నా ఆ మంత్రి గారిని వదిలేసి కేడర్ మాత్రం ఏ పదవి లేని నేతల చుట్టూ తిరుగుతుంది. గులాబీ పార్టీలో వర్గపోరుకి అడ్డాగా మారిన ఖమ్మంజిల్లా పై మంత్రి పువ్వాడ అజయ్ పట్టు సాధించలేకపోతున్నారా అన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఖమ్మం జిల్లాలో పట్టు సాధించాలని పువ్వాడ అజయ్ మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికి అది సాద్యం కాలేదు. అధికారంలో లేని నేతలిద్దరు తుమ్మల, పొంగులేటి వైపే కార్యకర్తలు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. అజయ్ కి యువనేత కేటీఆర్ మద్దతు ఉన్నప్పటికి అజయ్ వైపు కార్యకర్తలు పెద్దగా మొగ్గు చూపడం లేదు. ఒక్కఖమ్మం నియోజకవర్గంలో మాత్రమే అజయ్‌ హవా కనిపిస్తోంది. మిగతా చోట్ల ఆయనకు పెద్దగా పట్టున్నట్టు కనిపించడం లేదు.

రెండవ సారి టీఆర్ఎస్ అధికారంలొకొచ్చాక పువ్వాడ అజయ్ ని మంత్రి పదవి వరించింది. అదే సమయంలో ఓటమికి కారణమయ్యాడంటూ తుమ్మల నాగేశ్వర్రావు, అజయ్ లమద్య వివాదం కొనసాగుతుంది. ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అజయ్ లమద్య కూడ వివాదాలు తారా స్థాయికి చేరాయి. పొంగులేటి జన్మ దినం సందర్బంగా కార్యకర్తలు ప్లెక్సీలు ఏర్పాటు చేస్తే… అజయ్ తీయించేశారన్న ఆరోపణలున్నాయి. ఈ సందర్భంగా పొంగులేటి వర్గం జరిపిన ర్యాలీపై పోలీసులు కేసు కూడా పెట్టారు. దీంతో వారిద్ధరి ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది.

వీరి వర్గపోరు పై దృష్టి పెట్టిన కేటీఆర్ ఇద్దరు జిల్లానేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఇద్దరిని కలిపి విందు రాజకీయం నడిపినా పరిస్థితిలో పెద్దగా మార్పయితే రాలేదు. అజయ్ కుమార్ తన వర్గాన్ని చీల్చడానికి ప్రయత్నాలు చేశాడన్నది పొంగులేటి ఆరోపణ. తన వెన్నంటే ఉండే నేతలను తనకు దూరం చేస్తున్నరన్నది పొంగులేటి వాదన. ఇలా తన వర్గానికి చెందిన జెడ్పీ చైర్మన్ కమల్ రాజు,వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తన నుంచి దూరం చేశారని అసంతృప్తిగా ఉన్నారు పొంగులేటి.

అయితే ఖమ్మం కార్పోరేషన్ లో మాత్రం పువ్వాడ అజయ్ దే ఆదిపత్యంగా ఉంటోంది. తన నియోజకవర్గంలో మరో వ్యక్తి వేలు పెట్టే పరిస్థితిలేకుండా చేసుకోగలిగాడు. తుమ్మల, పొంగులేటి తోనే కాదు ఎంపి నామా తో కూడా అంటీముట్టనట్టుగానే ఉన్నారు పువ్వాడ అజయ్. జిల్లా అదికారులు కూడా పువ్వాడ అజయ్ వల్ల… ఎంపీకి సహకరించని పరిస్థితి ఉంది. పువ్వాడ అజయ్ కుమార్.. తొలుత సండ్ర వెంకటవీరయ్య, పాలేరు ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి, వనమా లతో సఖ్యతగా ఉండి వారిని తన వర్గంగా ముద్ర వేసే ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవ్వలేదు.

తుమ్మల, పొంగులేటిలు ఇద్దరు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ హల్ చల్ చేస్తున్నారు. అలాగని, వారిద్దరికీ టీఆర్ఎస్‌లో ఎలాంటి పదవీ లేదు. అయినా, వీరిద్దరూ ప్రతి చిన్న పంక్షన్ కు, పెళ్లికి, పేరంటానికి , చావులకు, కర్మలకు వెళ్లి రావడం పరిపాటిగా మారిపోయింది. ఏ అధికారం లేకుండానే.. జిల్లా వ్యాప్తంగా చక్కర్లు కొట్టేస్తున్నారు ఈ ఇద్దరు నేతలు. వీరిద్దరికీ కార్యకర్తలు కూడా అదేస్థాయిలో నీరాజనాలు పడుతున్నారు. అన్నీ అధికారాలున్న మంత్రి అజయ్ మాత్రం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news