రేవంత్ రెడ్డి ని ఇబ్బంది పెట్టే అవసరం మాకు లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రేవంత్ రెడ్డిని ఎన్నికల వరకు పిసిసిగా కొనసాగించాలనేదే తన ఆలోచనని చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ ఎందుకు టెంప్ట్ అవుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఆయన ఎందుకు టెంప్ట్ అవుతున్నాడో ఆయనని కూడా అడుగుతాను అన్నారు.
పార్టీలో చిన్న చిన్న సమస్యలు సహజమనే అన్న ఆయన.. పిసిసి అంటేనే ఫ్రీ హ్యాండ్ అని చెప్పుకొచ్చారు. కొందరు మూర్ఖులు అసమ్మతి అనే పదాన్ని కోవర్టులుగా మార్చేశారని మండిపడ్డారు. తాను మొదటి నుండి పీసీసీ పదవి కావాలని అడుగుతున్నానని.. ఆ పదవి వచ్చేవరకు అడుగుతూనే ఉంటానని అన్నారు. తాను ఏదైనా మాట్లాడితే గొడవ అంటారని.. రాజకీయ పార్టీలలో కుర్చీ అడగడం, దానికోసం ప్రయత్నించడంలో తప్పేముందన్నారు.
అప్పుడు ఉత్తంకుమార్ రెడ్డి ని దించండి అని.. రేవంత్ రెడ్డి ని ఎక్కించండి అని అనలేదా! మరి దానికి ఎవరి సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ని దించాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అందరి జాగీరు అన్న జగ్గారెడ్డి.. రాబోయే ఎన్నికలను రేవంత్ నాయకత్వంలోనే నడిపిద్దాం అన్నారు. రేవంత్ రెడ్డిని దించే ఆలోచన అధిష్టానానికి కూడా లేదన్నారు. ఇక పీసీసీ పదవిలో ఎవరు ఉన్నా లాభనష్టాలు భరించాలన్నారు.