ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. “ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత దోషిగా తేలితే అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా?” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తర్వాత బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బండి సంజయ్ మహిళలకు క్షమాపణలు డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు చేపట్టాలని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు.
అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించబోనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. సామెతలను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని.. అవి ఆయన వ్యక్తిగతంగా చేసి ఉంటారని అన్నారు. అంతేకాకుండా బండి సంజయ్తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. అయితే అరవింద్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ స్పందించారు. అరవింద్ బ్యాచ్‌లపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. పార్టీ మొత్తం బండి సంజయ్ తో ఉందని.. అధ్యక్షుడు అన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారని తెలిపారు. పార్టీ సంజయ్ నాయకత్వం పై సంతృప్తిగా ఉందన్నారు ప్రభాకర్.