రేణుకా చౌదరి టికెట్ ఇప్పిస్తా అని చాలా మందిని మోసం చేసింది: పువ్వాడ అజయ్

ఖమ్మం రాజకీయాలు కాక రేపుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ పై కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే చాలా విమర్శలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వాళ్లందరికి కౌంటర్ ఇచ్చే పనిలో ఉన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో నాయకులు… నాయకురాళ్లు ఉన్నారని… వారంతా రాళ్ల లాగానే ఉన్నారని విమర్శించారు. టికెట్స్ ఇప్పిస్తామని చెప్పి డబ్బు తీసుకుని ఆడబిడ్డలకు రేణుకా చౌదరి అన్యాయం చేసిందని తీవ్ర ఆరోపణ చేశారు.

ఇప్పుడు ఖమ్మంలో రచ్చబండ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని… ఖమ్మంలో అజయ్ కు బ్రేకులు వేస్తామంటున్నారు.. కానీ అజయ్ కు బ్రేకు వేసే సత్తా ఎవ్వరికీ లేదని ఆయన అన్నారు. ఎలక్షన్లు వస్తున్నాయంటే ఖమ్మం వచ్చి హడావిడి చేస్తారు…కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క ఆడబిడ్డను ఆదుకోలేదు. తెలంగాణలో కేసీఆర్ అనే మగాడు ఉన్నాడు.. ఆయనను అడ్డుకునే శక్తి వారికి లేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి అయిపోయిన తర్వాత కనబడకుండా పోయే నాయకులను నమ్మవద్దని సూచించారు. ఏడాదికి ఒకసారి సైబీరియా పక్షులు వస్తాయి కానీ… ఈ రాజకీయ పక్షులు 5 ఏళ్లకు ఒకసారి వచ్చి వెళతారని విమర్శించారు. అధికారంలోకి వచ్చే వరకు మాయమాటలు చెబుతారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను ఆశీర్వదించారని అన్నారు.