లాగ్ బుక్ తీసుకొచ్చి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని నిరూపించు.. తెలంగాణ ప్రజల కోసం కరెంట్ తీగలను పట్టుకోవడానికి సిద్దమన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ మేరకు కేటీఆర్ కి సవాల విసిరారు. ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కొమ్మిశెట్టి నర్సింహులు, సింగిల్ విండో వైస్ చైర్మన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సరైన సమయం.. సరైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి మాకు ఎంతో బలాన్ని ఇచ్చారని.. గృహలక్ష్మీ పేరుతో 3లక్షలు ఇస్తానన్న కేసీఆర్.. దాని గాలికి వదిలేశారని తెలిపారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలన్నీ ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమేనని.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ చెప్పినా 6 గ్యారెంటీలు చిన్న పథకాలే. అయినా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు కోమటిరెడ్డి. 60 రోజులు మీరు కష్టపడి కాంగ్రెస్ ను గెలిపించండని.. ఆలేరు నియోజకవర్గానికి తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఆలేరులో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని.. వీర్ల ఐలయ్యకు అందరూ సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఆలేరుకు ఎమ్మెల్యే కంటే నేను ఎక్కువ సార్లు వచ్చానని.. ఎమ్మెల్యే అంటే కార్లు వేసుకొని తిరగడం కాదన్నారు. పేదోడి కష్టం తీర్చాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలు అన్ని అమలు అవుతాయి.. పథకాలు అమలు కాకపోతే నా పదవులకు రాజీనామా చేస్తాను. బీఆర్ఎస్ ఇచ్చే డబ్బులకు ఆశపడకండి. ప్రజలారా ఆలోచించి ఓటు వేయండి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.