కర్ణాటక రాష్ట్ర ప్రజలు తమ తీర్పుతో తమ హస్తరేఖను మార్చుకున్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌కు మళ్లీ పట్టం కట్టారు. వార్ వన్ సైడే అన్నట్లు కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. మెజార్టీకి అవసరమైన 113 స్థానాల కంటే ఎక్కువగా.. ఎకాయెకి 135 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ గెలుపుతో కేవలం కర్ణాటకలోనేకాదు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలన్నీ సంబురాలు చేసుకున్నాయి.
అయితే ఈ ఎన్నిక తర్వాత అసలు ఘట్టం ఇవాళ జరగనుంది. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో ఇవాళ తేలనుంది. సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (75)కే అధిష్ఠానం మరోసారి అవకాశమిస్తుందా, పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌కు ఈసారి మార్గం సుగమం చేస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనిలో సీఎం అభ్యర్థిని నిర్ణయించే అవకాశం ఉంది. అయితే ఇవాళ బెంగళూరులో నిర్వహించే సీఎల్బీ భేటీలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు.