రాష్ట్రంలో డెంగ్యూతో మృతి చెందిన వారికి రూ.10 లక్షలు ఎగ్స్ గ్రేషియా ప్రకటించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యంతో పేద ప్రజలకు శాపంగా మారింది అన్నారు. వానాకాలం వస్తున్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఆస్పత్రుల సన్నధ్ధతపై సమీక్షలు నిర్వహించకపోవడం పారిశుధ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల మలేరియా, డెంగీ లాంటి సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా వైరల్ ఫీవర్లతో ప్రతి ఇద్దరిలో ఒకరు బాధపడుతున్నారు.
ఆస్పత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి ఏర్పడింది. గడచిన నెలన్నర కాలంలో 5246 డెంగీ కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే 36% డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. మొన్న ఒక్కరోజే ఐదుగురు డెంగీ వల్ల మృత్యువాట పడిన విషాద పరిస్థితి. జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.