హైదరాబాద్ లోని సనత్ నగర్ లో దారుణ సంఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎనిమిదేళ్ల వయస్సు ఉన్న అబ్దుల్ వహీద్ అనే బాలుడి మృతదేహం సనత్ నగర్ లోని అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలో ఉన్న ఓ నాలాలో లభించింది. బాలుడి హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారి వసీమ్ ఖాన్, ఫిజా ఖాన్ (హిజ్రా) కి డబ్బుల విషయంలో గొడవ జరిగింది.
ఈ క్రమంలోనే వసీమ్ ఖాన్ కొడుకును హిజ్రా కిడ్నాప్ చేసి.. హత్య చేసి డ్రమ్ములో కుక్కి ఓ ఆటో డ్రైవర్ సహాయంతో కాలువలో పడేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును చేదించారు. డబ్బుల విషయంలో హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. అయితే తాజాగా ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. బాలుడి మృతి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి తలసాని. దోషులు ఎంతటి వారైనా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి తలసాని.